Bible Versions
Bible Books

Isaiah 51 (ERVTE) Easy to Read Version - Telugu

1 “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు బండనుండి చెక్కబడ్డారో, బండ ఆయనే.
2 అబ్రాహాము మీ తండ్రి, మీరు ఆయన్ని చూడాలి. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తి శారాను మీరు చూడాలి. అబ్రాహామును నేను పిలిచినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు నేను అతణ్ణి ఆశీర్వదించాను, అతడు ఒకగొప్ప వంశాన్ని ప్రారంభించాడు. అనేకానేక మంది అతనినుండి ఉద్భవించారు.”
3 అదే విధంగా సీయోనును యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు.
4 “నా ప్రజలారా, నా మాట వినండి! ప్రజలు ఎలా జీవించాలో అది వారికి చూపించే దీపాల్లాంటివి నా నిర్ణయాలు.
5 నేను న్యాయవంతుడనని త్వరలోనే నేను చూపిస్తాను. త్వరలోనే నేను నిన్ను రక్షిస్తాను. నేను నా శక్తిన్ని ప్రయోగించి, రాజ్యాలన్నింటికి తీర్పు తీరుస్తాను. దూర ప్రదేశాలన్నీ నాకోసం కనిపెట్టుకొని ఉన్నాయి. నా శక్తి వారికి సహాయం చేయాలని అవి కనిపెట్టుకొని ఉన్నాయి.
6 ఆకాశాలవైపు చూడండి. మీ చుట్టూ కింద ఉన్న భూమిని చూడండి. ఆకాశాలు పొగ మేఘాల్లా మాయమైపోతాయి. భూమి పనికి మాలిన పాత గుడ్డల్లా అవుతుంది. భూమి మీద మనుష్యులు మరణిస్తారు. అయితే నా రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది. నా దయ ఎప్పటికీ అంతంకాదు.
7 దయను అవగాహన చేసికొనే ప్రజలారా, మీరు నా మాట వినాలి. నా ఉపదేశాలను పాటించే ప్రజలారా నేను చెప్పే మాటలు మీరు వినాలి. దుష్ట ప్రజలు విషయం భయపడకండి. వారు మీకు చెప్పే చెడ్డ విషయాలను గూర్చి భయపడకండి.
8 ఎందుకంటే వారు పాత గుడ్డల్లా ఉంటారు గనుక. చిమ్మెటలు వాటిని తినివేస్తాయి. వారు గొర్రెబొచ్చులా ఉంటారు. పురుగులు వాటిని తినివేస్తాయి. అయితే నా దయ శాశ్వతంగా కొనసాగుతుంది. నా రక్షణ శాశ్వతంగా సదా కొనసాగుతుంది.”
9 యెహోవా హస్తమా (శక్తి) మేలుకో! మేలుకో! నీ బలం సిద్ధం చేయి. చాలాకాలం కిందట నీవు చేసినట్టు పూర్వకాలాల్లో నీవు చేసినట్టు నీ బలాన్ని ప్రయోగించు. రాహాబును ఓడించిన శక్తి నీవే. మకరాన్ని నీవే ఓడించావు.
10 సముద్రం ఎండిపోయేట్టు నీవే చేశావు. మహా అగాధ జలాలను ఎండిపోయేట్టు నీవు చేశావు. సముద్రపు అతి లోతైన స్థలాలను నీవు త్రోవగా చేశావు. నీ ప్రజలు మార్గాన వెళ్లి రక్షించబడ్డారు.
11 యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు. వారు ఆనందంగా సీయోనుకు తిరిగి వస్తారు. వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు. వారి ఆనందం వారి తలలమీద శాశ్వత కిరీటంలా ఉంటుంది. ఆనందంతో వారు పాటలు పాడు తూంటారు. దుఃఖం అంతా దూరమైపోతుంది.
12 యెహోవా చెబతున్నాడు, “నిన్ను ఆదరించే వాడను నేనే. కనుక ఇతరులను గూర్చి నీవెందుకు భయపడాలి? వాళ్లు కేవలం బతికి, చచ్చే మనుష్యులు మాత్రమే. వాళ్లు కేవలం మానవ మాత్రులువారు కూడా గడ్డిలాగే చస్తారు.”
13 యెహోవా మిమ్మల్ని చేశాడు. తన శక్తితో ఆయన భూమిని చేశాడు. తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింపజేసాడు. కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచి పోతారు. కనుక మీకు హాని చేసే కోపిష్ఠులైన మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయపడుతుంటారు. మనుష్యులు మిమ్మును నాశనం చేయాలను పథకం వేసారు. కానీ ఇప్పుడు వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు.
14 చెరసాలలోని మనుష్యులు త్వరలోనే విడుదల చేయబడతారు. వాళ్లు చెరసాలలోనే మరణించి, కుళ్లిపోరు. మనుష్యులకు సరిపడినంత ఆహారం ఉంటుంది.
15 “నేను యెహోవాను, మీ దేవుడను. నేను సముద్రాన్ని కదలిస్తాను, కెరటాలు పుట్టిస్తాను.’ (ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.)
16 “నా సేవకా, నీవు చెప్పాలని నేను కోరే మాటలను నేనే నీకు ఇస్తాను. నా చేతులతో నిన్ను నేను కప్పిఉంచి కాపాడుతాను. కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చేసేందుకు నిన్ను నేను ఉపయోగించుకొంటాను. ‘మీరు నా ప్రజలు అని ఇశ్రాయేలుతో చెప్పేందుకు నిన్ను నేను వాడుకొంటాను.”
17 మేలుకో! మేలుకో! యెరూషలేమా, లెమ్ము! నీ మీద యెహోవా చాలా కోపగించాడు. అందువల్ల నీవు శిక్షించబడ్డావు. నీవు తాగాల్సిన ఒక విషపుపాత్రలా ఉంది శిక్ష. నీవు దానిని తాగావు.
18 యెరూషలేముకు చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆమెకు నాయకులు కాలేదు. ఆమె పెంచిన పిల్లలు ఎవ్వరు ఆమెను నడిపించే మార్గదర్శులు కాలేదు.
19 యెరూషలేముకు జంట జంటలుగా కష్టాలు వచ్చాయి, దొంగిలించటం, చొరబడటం, మహా ఆకలిపోరాటం. నీవు శ్రమ అనుభవిస్తున్నప్పుడు నీకు ఎవ్వరూ సహాయం చేయలేదు. ఎవరూ నీ మీద దయచూపించలేదు.
20 నీ ప్రజలు బలహీనులయ్యారు. వారు నేలమీద పడి, అలానే ఉండిపోయారు. ప్రతి వీధిమలుపులోను వారు పడివున్నారు. వారు వలలో పట్టబడిన జంతువుల్లా ఉన్నారు. వారు ఇంకెంత మాత్రం భరించలేనంతగా, యెహోవా కోపంచేత శిక్షించబడ్డారు. దేవుడు వారికి ఇంకా ఎక్కువ శిక్ష విధిస్తాను అన్నప్పుడు వారు మరీ బలహీనులై పోయారు.
21 అయ్యో, యెరూషలేమూ, నా మాట విను. ఒక తాగుబోతువానిలా నీవు బలహీనంగా ఉన్నావు, కానీ నీవు ద్రాక్షరసం తాగినందుచేత కాదు మత్తుగా ఉన్నది. నీవు “విషపు పాత్ర” మూలంగా బలహీనంగా ఉన్నావు.
22 నీ దేవుడు, యజమానియైన యెహోవా తన ప్రజలకోసం పోరాడుతాడు. ఆయన నీతో ఇలా అంటున్నాడు: “చూడు, ‘విషపు పాత్రను’ (శిక్షను) నీ వద్దనుండి నేను తొలగించి వేస్తున్నాను. నీ మీద నా కోపాన్ని తీసివేస్తున్నాను. ఇంకెంత మాత్రం నీవు నా కోపం మూలంగా శిక్షించబడవు.
23 నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట ,సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.’
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×