1 అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. యూదా వంశానికి చెందిన జబ్ది మనుమడు, కర్మి కుమారుడు ఆకాను అనే పేరుగలవాడు ఒకడు ఉన్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నింటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది.
2 వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి *హాయి అనగా “పాడుబడిన” ఊరు అని అర్థం. పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపించాడు. బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉంది హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ మనుష్యులు వెళ్లారు.
3 తర్వాత ఆ మనుష్యులు యెహోషున దగ్గరకు తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మనకు మన మనుష్యులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి రెండువేల మంది లేక మూడు వేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరాడేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” అన్నారు వారు.
4 (4-5) కనుక సమారు మూడువేల మంది మనుష్యులు హాయికి వెళ్లారు. కాని హాయివారు ఇశ్రాయేలు మనుష్యులను 36 మందిని చంపివేసారు. పైగా ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. హాయివాళ్లు తమ పట్టణ ద్వారాల దగ్గరనుండి షేబారీమువరకు వాళ్లను తరిమివేసారు. హాయివాళ్లు వారిని బాగా కొట్టివేసారు. ఇశ్రాయేలు ప్రజలు అది చూసి, చాలా భయపడిపోయారు, ధైర్యం కోల్పోయారు.
6 యెహోషువ ఇది విని, తన బట్టలు చింపుకొని, పవిత్ర పెట్టె ముందర నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి పోసుకొన్నారు.
7 అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యోర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యోర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది.
8 నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు.
9 కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలు అందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?”
10 యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు నీవు సాష్టాంగ పడతావు?
11 ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేసారు. వాళ్లు విధేయులు కావాలని నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు కొన్ని తీసుకొన్నారు. వారు నా దగ్గర దొంగతనం చేసారు. వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ వస్తువుల్ని వాళ్లు వారికోసం దాచుకొన్నారు.
12 అందుచేతనే ఇశ్రాయేలు సైన్యం యుద్ధంలో ఓడిపోయి పారిపోయింది. వారు తప్పు చేసినందువల్లనే ఇలా జరిగింది. వాళ్లు నాశనం కావాలి. నేను ఇంక మీకు సహాయం చేయను. మీరు నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే తప్ప నేను ఇక మీదట మీకు తోడుగా ఉండును.
13 “ఇప్పుడు వెళ్లి, ప్రజలను పవిత్రం చేసి, ప్రజలతో ఇలా చెప్పు, ‘మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపటికోసం సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు నాశనం చేయుమని ఆజ్ఞాపించిన వాటిని కొంత మంది దాచిపెట్టుకొన్నారని ఆయన చెబుతున్నాడు. వాటిని మీరు పారవేసేటంతవరకు మీరెన్నటికీ మీ శత్రువుల్ని ఓడించలేరు.
14 “ ‘రేపు ఉదయం మీరంతా యెహోవా ఎదుట నిలవాలి. అన్ని గోత్రాలూ యెహోవా యెదుట నిలబడాలి. ఒక గోత్రాన్ని యెహోవా నిర్ణయం చేస్తాడు. అప్పుడు ఆ గోత్రం మాత్రమే యెహోవా యెదుట నిలబడాలి. అప్పుడు ఆ గోత్రం నుండి ఒక వంశాన్ని యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ వంశం వాళ్లు మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. ఆ వంశంలో నుండి ఒక్క కుటుంబాన్ని మాత్రమే యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఒక్కొక్క పురుషుని యెహోవా చూస్తాడు.
15 మనం నాశనం చేయాల్సిన వాటిని దాచిపెట్టుకొన్న మనిషి పట్టుబడతాడు. అప్పుడు ఆ మనిషిని అగ్నితో కాల్చి నాశనం చేయాలి. మరియు అతనికి కలిగిన సమస్తం అతనితో బాటు నాశనం చేయబడుతుంది. యెహోవా ఆజ్ఞాపించిన ఒడంబడికను ఆ మనిషి ఉల్లంఘించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతడు మహాఅపరాధం చేసాడు.’ ”
16 మర్నాడు ఉదయం పెందలాడే ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోవా ఎదుటకు యోహోషువ నడిపించాడు. ఇశ్రాయేలు గోత్రాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. యూదా గోత్రాన్ని యెహోవా నిర్ణయించాడు.
17 కనుక యూదా గోత్రములోని వంశాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జెరహు వంశాన్ని యెహోవా నిర్ణయం చేసాడు. అప్పుడు జెరహు వంశంలోని కుటుంబాలు అన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జబ్ది కుటుంబం నిర్ణయించబడింది.
18 అప్పుడు ఆ కుటుంబంలోని పురుషులంతా యెహోవా ఎదుటికి రావాలని యెహోషువ చెప్పాడు. కర్మీ కుమారుడైన ఆకానును యెహోవా నిర్ణయం చేసాడు. (జిర్మి కుమారుడు కర్మి, జెరహు కుమారుడు జబ్ది).
19 అప్పుడు ఆకానుతో యెహోషువ అన్నాడు: “నా కుమారుడా, (నీ ప్రార్థన చేసుకో) ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించి, నీవు ఒప్పుకో. నీవేం చేసావో నాతో చెప్పు. నా దగ్గర ఏమీ దాచేందుకు ప్రయత్నించకు!”
20 ఆకాను ఇలా జవాబిచ్చాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన మాట నిజమే. నేను చేసింది ఏమిటంటే,
21 యెరికో పట్టణాన్ని అందులో ఉన్న వాటన్నిటినీ మనం పట్టుకొన్నాము గదా! వాటిలో అందమైన ఒక బబులోను అంగీ, రెండు వందల తులాల వెండి, యాభైతులాలకంటె ఎక్కువ బంగారం నేను చూసాను. ఇవన్నీ తప్పక నాకు కావాలనిపించింది. అందుచేత నేను వాటిని తీసుకొన్నాను. నా గుడారంలో నేల తవ్వితే అవి మీకు కనబడుతాయి. వెండి కూడ అంగీ క్రిందనే ఉంది.”
22 కనుక యెహోషువ కొందరు మనుష్యుల్ని ఆ గుడారానికి పంపించాడు. వారు ఆ గుడారానికి పరుగెత్తి వెళ్లి, ఆ వస్తువులు గుడారంలో దాచిపెట్టబడి ఉండటం చూసారు. వెండి కూడా అంగీ క్రిందనే ఉంది.
23 ఆ మనుష్యులు ఆ వస్తువుల్ని గుడారంలోనుంచి వెలుపటికి తీసుకొనివచ్చారు. వారు ఆ వస్తువుల్ని యెహోషువ దగ్గరకు, ప్రజలందరి దగ్గరకు తీసుకొని వెళ్లారు. వారు యెహోవా ఎదుట వాటిని నేలమీద పెట్టారు.
24 అప్పుడు యెహోషువ, ప్రజలు అందరూ కలిసి జెరహు కుమారుడు ఆకానును ఆకోరు †ఆకోరు అనగా “కష్టాలు” లేక “సమస్యలు” అని అర్థం. లోయకు తీసుకొని వెళ్లారు. వెండి, అంగీ, బంగారం, ఆకాను కుమారులు, కూతుళ్లు, అతని పశువులు, అతని గాడిదలు, అతని గొర్రెలు, అతని గుడారం, అతనికి ఉన్న సర్వమును వారు తీసుకొని వెళ్లారు. వారు వీటన్నింటినీ ఆకానుతోబాటు ఆకోరు లోయకు తీసుకొని వెళ్లారు.
25 అప్పుడు యెహోషువ, “నీవు మాకు ఇంత కష్టం ఎందుకు తెచ్చిపెట్టావో నాకు తెలియదు! కానీ ఇప్పుడు యెహోవా నిన్ను బాధిస్తాడు!” అన్నాడు. అప్పుడు ప్రజలు ఆకాను చచ్చేంతవరకు అతణ్ణి రాళ్లతో కొట్టారు. అతని కుటుంబాన్నికూడ వారు చంపేసారు. అప్పుడు వాళ్లందర్నీ, అతనికి ఉన్నదాన్నంతటినీ ప్రజలు కాల్చివేసారు.
26 వారు ఆకానును కాల్చేసిన తర్వాత, అతని శరీరం మీద చాల రాళ్లు కుప్పగా వేసారు. ఆ రాళ్లు నేటికీ అక్కడ ఉన్నాయి. (కనుక యెహోవా ఆకానును బాధించాడు.) అందుకే ఆ స్థలం ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆ తర్వాత యెహోవా ప్రజల మీద కోపగించలేదు.