Bible Versions
Bible Books

Ecclesiastes 10 (ERVTE) Easy to Read Version - Telugu

1 అత్యంత పరిమళ భరితమైన తైలాన్ని గబ్బు పట్టించేందుకు చచ్చిన కొద్దిపాటి ఈగలేచాలు. అదే విధంగా, జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, మంటగలిపేందుకు కొద్దిపాటి మూర్ఖత్వం చాలు.
2 వివేకవంతుడి ఆలోచనలు అతన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. అయితే, అవివేకి అలోచనలు అతన్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి.
3 మూర్ఖుడు అలా దారి వెంట పోయేటప్పుడు సైతం తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాడు. దానితో, వాడొక మూర్ఖుడన్న విషయాన్ని ప్రతి ఒక్కడూ గమనిస్తాడు.
4 యజమాని కేవలం నీపట్ల కోపం ప్రదర్శించినంత మాత్రాన నువ్వు నీ కొలువు వదిలెయ్యబోకు. నువ్వు ప్రశాంతంగా, సాయంగా వుంటే, పెద్ద పెద్ద పొర పాట్లను కూడా నువ్వు సరిదిద్దవచ్చు .
5 ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే పొరపాటు:
6 అవివేకులకు ముఖ్యమైన పదవులు, జ్ఞాన సంపన్నులకు అప్రధానమైన పదవులు కట్టబెడతారు.
7 సేవకులుగా ఉండదగినవాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, అధికారులుగా ఉండదగిన వాళ్లు (వాళ్ల సరసన బానిసల మాదిరిగా) నడుస్తూవుండటం నేను చూశాను.
8 గొయ్యి తవ్వే వ్యక్తి, తానే దానిలో పడవచ్చు. గోడ కూలగొట్టేవాణ్ణి పాము కాటెయ్యవచ్చు.
9 పెద్దబండలను దొర్లించేవాడికి వాటివల్లనే గాయాలు కావచ్చు. చెట్లు నరికేవాడికి కూడా ప్రమాదం లేకపోలేదు, (ఆ చెట్లు అతని మీద కూలవచ్చు.)
10 అయితే, పరిజ్ఞానంవుంటే, పనైనా సులభతరం అవుతుంది. మొండి కత్తితో కొయ్యడం చాలా కష్టం. అయితే, మనిషి దానికి పదును పెడితే, అప్పుడు పని సులభతరమవుతుంది. (జ్ఞానం అంత సున్నిత మైనది.)
11 ఒక వ్యక్తికి పాముల్ని ఎలా అదుపు చేయాలో తెలియవచ్చు. కాని, అతను అందుబాటులో లేనప్పుడు పాము ఎవరినైనా కాటేస్తే నైపుణ్యం వ్యర్థమే. (జ్ఞానం అలాంటిది.)
12 వివేకవంతుడి మాటలు ప్రశంసా పాత్రలు. అయితే అవివేకి మాటలు వినాశకరమైనవి.
13 ఆదిలోనే మూర్ఖుడు అవకతవకగా మాట్లాడతాడు. చివర్లో ఇక అతనివి ఉన్మత్త ప్రలాపాలుగా ముగుస్తాయి.
14 అజ్ఞాని ఎడతెగకుండా (తను చెయ్యబోయే వాటిని గురించి) మాట్లాడతాడు. అయితే, భవిష్యత్తులో ఏమి జరగబోయేది ఎవరికీ తెలియదు. తర్వాత ఏమి జరిగేది. ఒక్కడికి తెలియదు.
15 తన గమ్యానికి చేరుకునే మార్గం యేమిటో తెలుసుకునే నేర్పు మూర్ఖుడికి వుండదు, అందుకే అతను జీవితకాలమంతా కష్టించి పని చెయ్యాలి.
16 రాజు శిశుప్రాయుడైనా, బానిస అయినా రాజ్యానికి చాలా చెరుపు జరుగుతుంది. అధికారులు తిండిపోతులై, తమ కాలమంతా భోజన పానాదులతోనే వినియోగించేవాళ్లయితే, దేశానికి చాలా చెరుపే జరుగుతుంది.
17 ఒక దేశపు రాజు కులీనుడైతే, దేశానికి ఎంతో మంచి జరుగుతుంది . దేశాధికారులు తిండిపోతులు, తాగుబోతులు కాక, శక్తి పుంజుకు నేందుకు మాత్రమే అన్నపానాలు మితంగా సేవించే వారైతే, దేశానికి ఎంతో క్షేమం.
18 మనిషి మరి బద్ధకస్తుడైతే అతని ఇల్లు కురవనారంభిస్తుంది, ఇంటి పైకప్పు కూలి పోతుంది.
19 మనుష్యులకి తిండి సంతృప్తి నిస్తుంది, ద్రాక్షారసం వాళ్లని మరింత ఆనంద పరుస్తుంది. అయితే, డబ్బుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.
20 రాజును గురించి చెడుగా మాట్లాడకు. రాజును గురించి చెడ్డ ఆలోచనలు కూడా చేయకు. నీ యింట నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధనికులను గురించి చెడుగా మాట్లాడకు. ఎందుకంటావేమో, గోడలకి చెవులుంటాయి. నువ్వన్న మాటలన్నీ పిట్టలు చేర వేస్తాయి. వాళ్లకి చేరుతాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×