Bible Versions
Bible Books

Genesis 9 (ERVTE) Easy to Read Version - Telugu

1 నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు.
2 భూమి మీదనున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేలమీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు.”
3 “గతంలో నీవు తినేందుకు పచ్చ మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపై నున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను - అదంతా నీదే.
4 అయితే నీకు నేను ఒక ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము (రక్తం) ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు.
5 అనగా మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, అలానే మనిషినైనా మరో మనిషి ప్రాణం తీస్తే, మనిషి రక్తాన్ని అడుగుతాను.
6 “దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేసాడు. కనుక యింకొక మనిషిని చంపిన వాడు మరో మనిషి చేత చంపబడాలి.”
7 నోవహూ, “నీవు, నీ కుమారులు అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక.”
8 తర్వాత నోవహుతో అతని కుమారుతో దేవుడు ఇలా అన్నాడు:
9 This verse may not be a part of this translation
10 నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను, నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను.
11 ఇదే నీకు నా వాగ్దానం. వరద నీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”
12 తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్టు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను వాగ్దానం నేను చేసానని చెప్పేందుకు ఇది రుజువు. వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే రుజువు.
13 మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడం బడికకు రుజువు రంగుల ధనస్సు.
14 భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు.
15 రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఒప్పందం చెబుతోంది.
16 మేఘాల్లో రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకు, భూమిమీద సకల ప్రాణులకు మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.”
17 కనుక, “భూమిమీద సకల ప్రాణులతోని నేను చేసిన ఒడంబడికకు మేఘ ధనస్సు రుజువు” అని నోవహుతో యెహోవా చెప్పాడు. కనుక నోవహుతో ప్రభువు, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు మేఘములోని ధనస్సు రుజువు” అని చెప్పాడు.
18 నోవహుతో కూడ అతని కుమారులు ఓడలో నుండి బయటకు వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాఫెతు. (హాము కనానుకు తండ్రి).
19 ముగ్గురు మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద ప్రజలంతా ముగ్గురి కుమారుల నుండి వచ్చినవాళ్లే.
20 నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు.
21 నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని తాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకొనలేదు.
22 కనాను తండ్రి హాము, దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరులతో హాము విషయం చెప్పాడు.
23 అప్పుడు షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి బట్టలు లేకుండా ఉన్న తమ తండ్రి ఒంటిమీద బట్ట కప్పారు.
24 తర్వాత నోవహు మేల్కొన్నాడు. (ద్రాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు). అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసిన దాన్ని అతడు తెలుసుకొన్నాడు.
25 కనుక నోవహు అన్నాడు: “కనాను శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!”
26 నోవహు ఇంకా ఇలా అన్నాడు: “షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక! కనాను షేముకు బానిస అవును గాక.”
27 యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చును గాక! షేము గుడారాలలో దేవుడు నివసించు గాక! కనాను వారికి బానిస అవును గాక!”
28 జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బతికాడు.
29 నోవహు మొత్తం 950 సంవత్సరాలు బతికాడు. తరువాత అతడు మరణించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×