Bible Versions
Bible Books

Jeremiah 20 (ERVTE) Easy to Read Version - Telugu

1 దేవాలయంలో పషూరు అనబడే ఒక యాజకుడున్నాడు. అతడు దేవాలయంలో ప్రధానాధికారి. పషూరు తండ్రి పేరు ఇమ్మేరు. యిర్మీయా భవిష్యత్ విషయాలు ఆలయ ప్రాంగణంలో చెప్పటం పషూరు విన్నాడు.
2 అతడు ప్రవక్తయైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దేవాలయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండకొయ్య వేయించాడు.
3 మరునాడు యిర్మీయాను పషూరు బొండ కొయ్య బంధం నుండి తొలగించాడు. అప్పుడు యిర్మీయా పషూరుతో ఇలా అన్నాడు, “దేవుడు నిన్ను పిలిచే పేరు పషూరు కాదు. ఆయన నీకు మాగోర్ మిస్సాబీబ్ అని పేరు పెడతాడు.
4 ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: ‘నీ వంటే నీకె భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతేగాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. యూదా ప్రజలందరినీ బబలోను రాజుకు అప్పగిస్తాను. అతడు యూదా వారందరినీ బబలోను దేశానికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్రజలను కత్తులతో నరికి వేస్తారు.
5 యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ధనరాశులను తీసుకొని బబలోను దేశానికి పట్టుకు పోతాడు.
6 పషూరు, నీవు, మరియు నీ ఇంటి వారందరునూ కూడా తీసుకొని పోబడతారు. బబలోనులో నివసించటానికి నీవు బలవంతంగా కొనిపోబడతావు! నీవు బబలోనులోనే చనిపోతావు. నీవా అన్య దేశంలోనే సమాధి చేయబడతావు. నీ స్నేహితులకు నీవు అబద్ధాలు బోధించావు. నేను చెప్పే విషయాలన్నీ జరగవని నీవు చెప్పినావు. నీ సహచరులంతా బబలోనులో చనిపోయి అక్కడే సమాధి చేయబడతారు.”‘
7 యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను. నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు.
8 నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను. దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను. యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను. కాని నా ప్రజలు నన్ను కేవలం అవమాన పర్చి, హేళన చేస్తున్నారు.
9 “నేనిక దేవుని గురించి మర్చిపోతాను. ఇక మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!” అని నేను కొన్ని సార్లు అనుకున్నాను. కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది! అది నన్ను లోపల దహించి వేస్తుంది. దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను. ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.
10 అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను. ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను. నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు. “మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం! లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు1 అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు. తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు. లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు”నని వారంటున్నారు.
11 కాని యెహోవా నాతో వున్నాడు. యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు. కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు. వారు నన్ను ఓడించలేరు. వారి ప్రయత్నం వ్యర్థం. వారు ఆశా భంగం చెందుతారు. వారు అవమానం పాలవుతారు. వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు.
12 సర్వశక్తి మంతుడవైన యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు. మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు. ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము.
13 యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము! యెహోవా పేద వారిని ఆదుకుంటాడు! ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!
14 నేను పుట్టిన రోజు శపింపబడును గాక! నా తల్లీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించవద్దు.
15 నేను పుట్టినట్లు నా తండ్రికి వర్తమానం యిచ్చిన మనుష్యుని శపించుము “నీకు పుత్ర సంతానం కలిగింది” అని చెప్పి అతడు నా తండ్రిని మిక్కిలి సంతోషపరిచాడు.
16 యెహోవా సర్వనాశనం చేసిన నగరాల మాదిరిగానే మనుష్యుడు కూడా దౌర్భాగ్యుడగును గాక! యెహోవా నగరాలపై ఏమాత్రం కనికరం చూపలేదు వారు ఉదయాన్నే యుద్ధ నినాదాలను విందురుగాక! మధ్యహ్న సమయంలో అతడు యుద్ధశోకాలు వినును గాక!
17 ఎందువల్లననగా అతడు నేను నా తల్లి గర్భంలో ఉండగానే నన్ను చంపలేదు. అతడే గనుక అప్పుడు నన్ను చంపి వుంటే నా తల్లి గర్భమే నాకు నా సమాధి అయివుండేది. నేను పుట్టివుండే వాడినే కాను.
18 నా తల్లి గర్భం నుండి నేనెందుకు బయటికి వచ్చినట్లు? నేను వచ్చి చూచినదంతా కష్టము, దుఃఖమే! నా జీవితం అవమానంతో అంతమవుతుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×