Bible Versions
Bible Books

4
:

1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు.
2 ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు.
3 అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి.
4 వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్ద.
5 మీరు (యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రివేళ ప్రవక్త కూడ మీతోబాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తాను.
6 “నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను.
7 వారు గర్విష్టులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారు ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.
8 “యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు పాపాలను ఇంకా ఇంకా ఎక్కువాగా కోరుకొన్నారు.
9 కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తాను.
10 వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి ఉండదు. వారు లైంగిక పాపాలు చేస్తారు. కాని వారికి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వారు యెహోవాను విడిచిపెట్టి వేశ్యలవలె తయ్యారయ్యారు.
11 “లైంగిక పాపాలు, ద్రాక్షామద్యం కొత్త ద్రాక్షారసం, మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి.
12 సలహా కోసం నా ప్రజలు కట్టెముక్కలను అడుగుతున్నారు. కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ బూటకపు దేవతలను వెంటాడారు.
13 వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తారు. చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లు కూడాపాపాలు చేస్తారు.
14 “వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు.
15 “ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ యూదాను అపరాధిగా ఉండ నియ్యకుము. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు …!’ అని అనవద్దు.
16 ఇశ్రాయేలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల పారిపోయే పెయ్యలాగ ఉంది.
17 “ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచివేయండి.
18 వారి త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేయుచు ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు.
19 కాని ఆమెను, ఆమె రెక్కలతో బంధించును. వారి బలి అర్పణల వలన వారు సిగ్గునొందుదురు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×