Bible Versions
Bible Books

:

1 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
2 నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను. కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు. మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.
3 దేవా, నీవు పవిత్రుడవు. నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహసనం.
4 మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు. అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
5 మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువులు నుంచి వారు తప్పించుకొన్నారు. వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
6 అందుచేత నేను మనిషిని కానా, పురుగునా? మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
7 నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు. నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
8 వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి. ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో! నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”
9 దేవా, నిజంగా నేను నీ మీద ఆధార పడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగిన వాడవు నీవే. నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు. నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటి నుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.
11 కనుక దేవా, నన్ను విడువకు. కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసే వారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు. వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు. (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్దికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు. వారి నోళ్లు పెద్దగా తెరచు కొని ఉన్నాయి.
14 నేలమీద పోయబడ్డ నీళ్లలా నా బలం పోయినది. నా ఎముకలు విడిపోయాయి. నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది. నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది. “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి. దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది. సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు.
17 నేను నా ఎముకల్ని చూడగలను. ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు. వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు!
18 ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.
19 యెహోవా, నన్ను విడువకుము! నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము. ప్రశస్తమైన నా ప్రాణాన్ని కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము. ఆబోతుకొమ్ములనుండి నన్ను కాపాడుము.
22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను. ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి. ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవాను ఘనపర్చండి. ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు. యెహోవా వారిని ద్వేషించడు. ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.
25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నీ నుండే వస్తుంది. నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు. యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి. మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు. సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తలవంచు తారు. మరియు వారి ప్రాణాలను కాపాడుకొన లేనివారు కూడా తల వంచుతారు. చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తలవంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు. యెహోవా విషయమై వారు, నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు వచ్చి దేవుని మంచి తనం గూర్చి చెబుతారు. దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి మనుష్యులు చెబుతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×