Bible Versions
Bible Books

1 Chronicles 24:22 (ERVTE) Easy to Read Version - Telugu

1 అహరోను వంశంవారు ఎవరనగా: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
2 కాని నాదాబు, అబీహులిద్దరూ తమ తండ్రి కంటె ముందుగానే చనిపోయారు. పైగా నాదాబు, అబీహులకు కుమారులు కలుగలేదు. కావున ఎలియాజరు మరియు ఈతామారులిద్దరూ యాజకులుగా సేవచేశారు.
3 ఎలియాజరు, ఈతామారు వంశం వారిని దావీదు రెండు గుంపులుగా విభజించాడు. వారి వారి కార్యాలను సక్రమంగా నిర్వహించటానికి వీలుగా దావీదు వారిని రెండు గుంపులుగా ఏర్పాటు చేశాడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు పనిచేశాడు. సాదోకు ఎలియాజరు సంతతివాడు. అహీమెలెకు ఈతామారు సంతతివాడు.
4 ఈతామారు వంశంలో కంటె ఎలియాజరు సంతతివారిలో ఎక్కువమంది నాయకులున్నారు. ఎలియాజరు సంతతి వారిలో పదహారు మంది నాయకులుండగా, ఈతామారు సంతతివారిలో ఎనిమిది మంది నాయకులు మాత్రమే వున్నారు.
5 ప్రతి వంశంలో నుండి మనుష్యులు ఎన్నుకోబడ్డారు. వారు చీట్లు వేసి ఎంపిక నిర్వహించారు. పవిత్ర స్థలాన్ని అధీనంలో వుంచుకొనేందుకు కొంత మందిని ఎన్నుకొన్నారు. మరికొంత మంది యాజకులుగా సేవచేయటానికి ఎంపిక చేయబడ్డారు. వీరంతా ఎలియాజరు, ఈతామారు వంశాలలోని వారు.
6 షెమయా కార్యదర్శి. ఇతడు నెతనేలు కుమారుడు. షెమయా లేవి సంతతివాడు. షెమయా ఆయా సంతతుల వారి పేర్లన్నీ రాశాడు. రాజైన దావీదు ముందు, వారి పెద్దల ముందు అతడు పేర్లు రాశాడు. యాజకుడైన సాదోకు, అహీమెలెకు, యాజకుల కుటుంబాలలో పెద్దలు, ఇతర లేవీయుల పేర్లు వున్నాయి. అబ్యాతారు కుమారుడు అహీమెలెకు. చీట్లు వేసిన ప్రతిసారీ వారొక మనుష్యుని ఎంపిక చేశారు. మనుష్యుని పేరు షెమయా రాసేవాడు. కావున ఎలియాజరు, ఈతామారు వంశాలలోని మనుష్యుల మధ్య పని విభజన జరిగింది.
7 మొదట ఎంపిక చేయబడినది యెహోయారీబు వంశంవారు. రెండవ చీటీలో యెదాయా వంశం వారు ఎంపిక చేయబడ్డారు.
8 మూడవ వంశం హారీము వారు. నాల్గవ వంశం శెయొరీము వారు.
9 ఐదవ వంశం మల్కీయాకు చెందినది. ఆరవది మీయామిను వంశానికి చెందినది.
10 ఏడవ చీటీ హక్కోజు వంశానికి పడింది. ఎనిమిదవ చీటీలో అబీయా వంశం ఎంపిక చేయబడింది.
11 తొమ్మిదవ చీటీలో యేషూవ వంశం ఎంపిక అయ్యింది. పదవ వంశం షెకన్యాది.
12 పదకొండవ చీటీ ఎల్యాషీబు వంశానికి పడింది. పన్నెండవది యాకీము వంశానికి వచ్చింది.
13 పదమూడవ చీటీలో హుప్పా వంశం ఎంపిక చేయబడింది. పదునాల్గవ చీటీ యెషెబాబు వంశానికి వచ్చింది.
14 పదిహేనవ చీటి బిల్గా వంశానికి పడింది పదహారవ చీటి ఇమ్మేరు వంశం వారికి వచ్చింది.
15 పదిహేడవ చీటి హెజీరు వంశానికి పడింది. పద్దెనిమిదవది హప్పిస్సేను వంశానికి వచ్చింది.
16 పందొమ్మిదవ చీటీలో పెతహయా వంశం వారు ఎన్నుకోబడ్డారు. ఇరవయ్యో చీటి యెహెజ్కేలు వంశానికి వచ్చింది.
17 ఇరవై ఒకటవ చీటి, యాకీను వంశానికి వచ్చింది. ఇరవై రెండవది గామూలు వర్గానికి వచ్చింది.
18 ఇరవై మూడవ చీటి దెలాయ్యా వంశానికి పడింది. ఇరవై నాల్గవది మయజ్యా వంశానికి వచ్చింది.
19 వంశాల వారంతా ఆలయంలో సేవ చేయటానికి ఎంపిక చేయబడ్డారు. ఆలయపు సేవలో అహరోను ఆదేశ సూత్రాలను వారు పాటించారు. నియమాలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అహరోనుకు ఇచ్చాడు.
20 మిగిలిన లేవి సంతతివారి పేర్లు ఇలా వున్నాయి: అమ్రాము సంతానం నుండి షూబాయేలు. షూబాయేలు సంతానం నుండి యెహెద్యాహు.
21 రెహబ్యా వంశం నుండి పెద్దవాడైన ఇష్షీయా.
22 ఇస్హారీ వంశం నుండి షెలోమోతు. షెలోమోతు వంశం నుండి యహతు.
23 హెబ్రోను పెద్ద కుమారుడు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవ వాడు యహజీయేలు. నాల్గవ కుమారుడు యెక్మెయాము.
24 ఉజ్జీయేలు కుమారుడు మీకా. మీకా కుమారుడు షామీరు.
25 మీకా సోదరుడు ఇష్షీ ఇష్షీ కుమారుడు జెకర్యా.
26 మెరారీ సంతతి వారు మహలి, మూషి మరియు అతని కుమారుడైన యహజీయాహు
27 మెరారి కుమారుడు యహజీయాహునకు షోహాము, జక్కూరు అను కుమారులు గలరు.
28 మహలి కుమారుడు ఎలియాజరు. కాని ఎలియాజరుకు కుమారులు లేరు.
29 కీషు కుమారుడు యెరహ్మెయేలు.
30 మూషి కుమారులు మహలి, ఏదెరు మరియు యెరీమోతు. వారంతా లేవీయుల కుటుంబాలలో పెద్దలు. వారి పేర్లు వారి కుటుంబాల ప్రకారం వ్రాయబడ్డాయి.
31 వారంతా ప్రత్యేక కార్యాలు నిర్వహించటానికి ఎంపిక చేయబడ్డారు. యాజకులైన వారి బంధువుల వలెనే వారుకూడ చీట్లు వేశారు. వారు రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకుల, లేవీయుల పెద్దల ముందు చీట్లు వేశారు. వారి వారి పనులకు కేటాయించేటప్పుడు వారి పెద్ద కుటుంబాలకు, చిన్న కుటుంబాలకు ఒకే రీతి చీట్లు వేయబడ్డాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×